As-Teacher-Nara-Lokesh : బాగా చదవండి Andhra Prabha Top News

As-Teacher-Nara-Lokesh : బాగా చదవండి Andhra Prabha Top News

  • లేదో.. నాకు మైనస్​ మార్కులు
  • సమాజంలో మార్పు కోసమే
  • విద్యాశాఖను ఎంచుకున్నా!
  • ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధిద్దాం
  • సంస్కరణలు కంప్లీట్​
  • ఇక బోధనపైనే టీచర్లు ఫోకస్​
  • విద్యా శాఖ మంత్రి లోకేష్

( ఆంధ్రప్రభ, కొక్కిలిగడ్డ (అవనిగడ్డ)

సమాజంలో మార్పు తెచ్చేందుకే నేను అత్యంత కఠినమైన విద్యాశాఖను ఎంచుకున్నాను. దీనిని నేను ఛాలెంజ్ గా స్వీకరించాను. విద్యావ్యవస్థలో మార్పు తేవడం ఉపాధ్యాయుల సహకారంతోనే సాధ్యమవుతుంది. దేశంలోనే ఆదర్శవంతంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్నది నా ధ్యేయం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఆర్టిజిఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను బుధవారం ఉదయం మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ… గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశాం, ఇక ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని సూచించారు. నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాం. రాష్ట్రవ్యాప్తంగా హార్డ్ వేర్ (ఇన్ ఫ్రా) మెరుగైంది, సాఫ్ట్ వేర్ (లెర్నింగ్ అవుట్ కమ్స్) మెరుగు పర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. కొక్కిలిగడ్డ హైస్కూలులో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తప్ప అన్ని సౌకర్యాలు కల్పించాం. అభ్యసనా ఫలితాల మెరుగుదలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి. ఫార్మేటివ్, సమ్మెటివ్ టెస్ట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపర్చాలి. వెనుకబడిన విద్యార్థుల పనితీరును మెరుగుపర్చేందుకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్ ను అందజేస్తాం. వివిధ తరగతుల్లో వెనుకబడిన పిల్లలు ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకొని, అటువంటి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్డండి. నూరుశాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు.

As-Teacher-Nara-Lokesh : తొలిసారిగా ప్రభుత్వ యాడ్స్

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల చిత్రాలతో పత్రికల్లో యాడ్స్ ఇచ్చామని మంత్రి లోకేష్ చెప్పారు. గత విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ వస్తున్నాం. టీచర్లు ఇక పూర్తిస్థాయిలో బోధనపైనే శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయులు తమ రోజువారీ విధినిర్వహణలో ఏదైనా సమస్య తలెత్తితే మీరు ఎంఇఓ, డిఇఓలకు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు, లీప్ యాప్ ద్వారా నేరుగా నాకు చెప్పొచ్చు. వచ్చేనెల 16,17,18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్ – టీచర్ మీటింగ్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నాం. ఉపాధ్యాయులంతా చొరవ తీసుకొని తల్లిదండ్రులను చైతన్యపర్చి లీప్ యాప్ డౌన్ లోడ్ చేయించండి. విద్యావ్యవస్థలో నేను అనుకున్నది సాధించాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల సహకారం అవసరం. అందరి సమిష్టికృషితోనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టగలుగుతాం. అందరం టీమ్ వర్క్ గా పనిచేసి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధిద్దాం.

As-Teacher-Nara-Lokesh : వందరోజుల ప్రణాళికలతో ….

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… ప్రభుత్వం అమలుచేసిన వందరోజుల కార్యాచరణ ప్రణాళిక, జిఎఫ్ఎల్ఎన్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాల్లో యాడ్స్ ఇవ్వడం ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్పందిస్తూ దీర్ఘకాలంలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అవసరం లేనివిధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. పదోతరగతిలో బాలికలు ఫెయిలైతే వారు సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఈ అంశాన్ని కూడా ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలన్నారు. గత ఏడాది మెగా డిఎస్సీ ద్వారా ఎంపికైన స్కూల్ అసిస్టెంట్ మనీష మాట్లాడుతూ… కేవలం 155 రోజుల్లో డిఎస్సీని పారదర్శకంగా పూర్తిచేసి, నాలాంటి వేలాదిమంది టీచర్ల కల నెరవేర్చారంటూ మంత్రి లోకేష్ కు కృతజ్జతలు తెలిపారు. హిందీ టీచర్ అనిత మాట్లాడుతూ… కొక్కిలిగడ్డ హైస్కూలులో ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలని విజ్జప్తి చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన వర్క్ బుక్స్ ఫలితాలను మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. మరో టీచర్ షర్మిల మాట్లాడుతూ… కొక్కిలిగడ్డ స్కూలులో సౌకర్యాల మెరుగుతో ఈ ఏడాది కొత్తగా 39మంది విద్యార్థులు చేరారని, వారంతా ప్రైవేటు కాన్వెంట్ల నుంచే వచ్చారని చెప్పారు. ఇందుకు కృషిచేసిన టీచర్లను మంత్రి లోకేష్ అభినందించారు. తమ స్కూలులో పాల్ ల్యాబ్ ఒక్కటి ఏర్పాటుచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని టీచర్ షర్మిల తెలుపగా, త్వరలోనే ఆ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. త్వరలో క్లిక్కర్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.

As-Teacher-Nara-Lokesh : మీరు చదవలేదో..

విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రిగారు నాకు మంచి మార్కులు వేస్తారు, మీరు సరిగా చదవకపోతే ఆయన నాకు మైనస్ మార్కులు వేస్తారు, నా భవిష్యత్తు మీపై ఆధారపడి ఉందని మంత్రి లోకేష్ చమత్కరించారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జడ్ పి హైస్కూలు నూతన భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతుల విద్యార్థులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మీ సౌకర్యం, మీ భవిష్యత్తు కోసం దాతలు అద్భుతంగా కొత్త భవనాలను నిర్మించారు. విద్యార్థులంతా కష్టపడి చదివి పాస్ పర్సంటేజిని పెంచాలి. ఇప్పటికే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చాం, త్వరలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్స్, బూట్లు అందజేస్తాం. విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచిమార్కులతో మెరుగైన ఫలితాలు సాధించాలి. విద్యార్థుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు లీప్ యాప్ ను రూపొందించాం. ఆయా సబ్జెక్టులకు సంబంధించి కంటెంట్ వీడియోలను తయారుచేశాం. లీప్ యాప్ ను విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకొని, తమబిడ్డల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వెనుకబడిన సబ్జెక్టులలో వారిని ఇంటివద్ద చదివించాలి. తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవనీయమైన వ్యక్తులు ఉపాధ్యాయులు, నా గురువుల వల్లే ప్రస్తుతం నేను ఈ స్థాయికి చేరుకున్నాను. విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.

అనంతరం మంత్రి లోకేష్, పి-4 కార్యక్రమం ద్వారా జెడ్పీ పాఠశాల నిర్మాణానికి సహకరించిన శ్రీ భ్రమరాంబిక ప్రాసెసింగ్ కంపెనీ చైర్మన్ కామరాజుగడ్డ బాల వెంకట సత్య ప్రసాద్ తదితర దాతలను మంత్రి ఘనంగా సత్కరించి అభినందించారు. దాతల సహకారంతో పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పడి, విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించబడుతోందని ఆయన తెలిపారు. సమాజ అభివృద్ధిలో దాతల సహకారం ఎంతో అవసరమని, విద్యా రంగ అభివృద్ధికి మరింత మంది ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

మంత్రి లోకేష్ వెంట రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, అవనిగడ్డ, పెడన, గుడివాడ, పెనమలూరు నియోజకవవర్గాల శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, వెనిగండ్ల రాము, బోడె ప్రసాద్, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, యువ నాయకుడు మండలి రాజా, మచిలీపట్నం ఆర్టీవో కే సాంబశివరావు, డీఈవో యు వి సుబ్బారావు, జడ్పిటిసి ఎం మల్లికార్జునరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, మాజీ సర్పంచ్ డి జానకి రాంబాబు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.