పరిసరాల పరిశుభ్రతతోనే కీటక జనిత వ్యాధుల నివారణ..

నస్పూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల పురపాలక పరిధిలోని సిసిసి నస్పూర్, సీతారాంపల్లి వార్డులలో కీటక జనిత వ్యాధుల నివారణ, వ్యాపించకుండా చర్యల్లో భాగంగా శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్,నగర మేయర్ ధరణి మధుకర్ స్థానిక కార్పొరేటర్లు సౌమ్య, కర్రే శ్రీనివాస్, సంపత్ రెడ్డి రాథోడ్ తో కలిసి ఇంటిపరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కార్యక్రమంనిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ, పురపాలక శాఖ సమన్వయంతో కీటక జనిత వ్యాధులైన దోమల ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఈ చర్యల్లో ముఖ్యంగా ప్రతి వారంలో రెండు రోజులపాటు మంగళ, శుక్రవారం వర్షాకాలంలో ఇంటి చుట్టుపక్కలు ఇండ్లలో నీటి నిలువలు లేకుండా చేసుకోవాలని, వాడిపడేసిన వస్తువులు టైర్లు,కొబ్బరి బొండాలు, పాత్రలు బాత్రూమ్లకు ఇరువైపులా వంట సామాగ్రి కడిగే ప్రాంతాలలో నీరు నిలువ లేకుండా చేసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, దోమలు గుడ్లు పెట్టకుండా పెరగకుండా లార్వాలనే చంపాలన్నారు. దోమలు కుట్టకుండా దోమతెరలు, జాలీలను ఉపయోగించలన్నారు. పరిశుభ్రమైన మంచినీటిని తీసుకొనడం వలన నీటి ద్వారా వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్త పడాలని,మున్సిపల్ సిబ్బందితో సహకరించి చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందించాలని, ఇంటి ప్రక్కన రోడ్డుపైన వేయడం ద్వారా రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్,మిడిల్ హెల్త్ ప్రొవైడర్స్ ప్రియాంక, ఆరోగ్య ఆశా కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు పాల్గొన్నారు.