చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం..

  • మైలవరం ఎమ్మెల్యే వసంత
  • కొండపల్లిలో తడి, పొడి చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పట్టణాల్లో రోజురోజుకు పెరుగుతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తడి మరియు పొడి చెత్త వ్యర్ధాల ప్రాసెసింగ్ ప్లాంట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. కొండపల్లి పట్టణ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రం (తడి, పొడి చెత్త వెధవ ప్రాసెసింగ్ ప్లాంట్)ను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించగా, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అధికారికంగా ప్రారంభించారు.

ప్లాంట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో తొలిసారిగా కొండపల్లి మున్సిపాలిటీలో ఈ ప్లాంట్ ను నెలకొల్పినట్లు చెప్పారు. డ్రెయినేజీల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోవడం వల్ల కొద్దిపాటి వర్షాలకి డ్రెయిన్లు పొంగి ప్రవహించి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీలో లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త మొత్తాన్ని పెద్ద ఎత్తున గుంటూరు వద్ద వెస్ట్ టు పవర్ జనరేషన్ ప్రాజెక్టుకు తరలించినట్లు చెప్పారు.

ఈ ప్లాంట్ ను సద్వినియోగం చేసుకుని కొండపల్లి మున్సిపాలిటీ కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేయడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. ఇలాంటి ఆధునిక వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలు పర్యావరణ పరిరక్షణకు ఎంత దోహదపడటంతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు.

పట్టణంలో చెత్త పేరుకుపోవడం వల్ల కలిగే దుర్వాసనలు, వ్యాధుల వ్యాప్తి, భూ కాలుష్యం, వాయు కాలుష్యం వంటి సమస్యలను నివారించడంలో ఈ ప్లాంట్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా అందించడం ద్వారా ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో సద్వినియోగం అవుతుందని, ప్రజల సహకారం ఉంటేనే కాలుష్య రహిత కొండపల్లి లక్ష్యాన్ని సాధించగలమని చెప్పారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామమోహనరావు (గాంధీ), మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కౌన్సిలర్ లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.