రాగినేడు నాగలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎన్నారై హర్కర ప్రసాదరావు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : అమెరికాలో నివసిస్తున్న ఎన్నారై హర్కర ప్రసాదరావు శనివారం పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా హర్కర ప్రసాదరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్మించిన ఈ దేవాలయం ప్రశాంతమైన వాతావరణంతో భక్తులను ఆకట్టుకుంటోందన్నారు. తొలిసారిగా ఈ ఆలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ, గ్రామ సర్పంచ్ సోమ కుమార్, ఉపసర్పంచ్ గుమ్మడి సోని విజయ, ఆలయ నిర్మాణకర్త కోలేటి దామోదర్, కోలేటి శ్రీనివాస్ కలిసి హర్కర ప్రసాదరావుకు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించి ఆలయ చిత్రపటాన్ని బహుకరించారు.
