‘వారసత్వ సంపదకు నిలయం మెదక్..

ఈ ప్రాంతాన్ని చూడకపోవడం సిగ్గుచేటు’ : మంచు విష్ణు

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పురాతన చరిత్ర, వారసత్వ సంపదకు మెదక్ జిల్లా నిలయమని ప్రముఖ నటుడు, సినీ నిర్మాత, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మెదక్ జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను శనివారం సందర్శించిన ఆయన, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు.

జిల్లా పర్యాటక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయం, చారిత్రక మెదక్ ఖిల్లా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ సీఎస్ఐ కేథడ్రల్ చర్చిని సందర్శించారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆయనకు స్వాగతం పలికారు. ఏడుపాయల ఆలయంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చరిత్ర, విశిష్టతను అదనపు కలెక్టర్ వివరించారు.

తర్వాత మెదక్ ఖిల్లాను సందర్శించిన మంచు విష్ణు దాని చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకున్నారు. అనంతరం మెదక్ సీఎస్ఐ కేథడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన చరిత్ర గురించి పుస్తకాల్లో ఎంతో చదివినా ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో లేని గొప్ప చారిత్రక వారసత్వం మనకు ఉందని, దానిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు ఎన్నో చారిత్రక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి జిల్లా యంత్రాంగం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని తెలిపారు. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఇంత విలువైన పర్యాటక ప్రాంతాలను చూడకపోవడం సిగ్గుచేటుగా అనిపించిందని వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో తాను నటించే లేదా నిర్మించే సినిమాల్లో మెదక్ జిల్లాకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తానని మంచు విష్ణు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నవీన్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు, డీఎస్పీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.