ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అరుదైన ఘనత

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన సముద్రాల రాజ్‌కుమార్ గౌడ్ రక్తదాతగా అరుదైన రికార్డు సృష్టించారు. ఆపదలో ఉన్న వారికి అవసరమైన సమయంలో రక్తదానం చేస్తూ మానవతా సేవలో ముందుంటున్న ఆయన, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 103వ సారి రక్తదానం చేసి మరోసారి ఆదర్శంగా నిలిచారు.

నటుడు చిరంజీవి అభిమానిగా ఆయన స్ఫూర్తితో రక్తదానం చేయాలని సంకల్పించిన రాజ్‌కుమార్, తాను మాత్రమే కాకుండా అనేక మందిని కూడా రక్తదానానికి ప్రోత్సహిస్తూ సామాజిక సేవలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సముద్రాల రాజ్‌కుమార్ గౌడ్ 103వ సారి రక్తదానం చేశారు. ఆయన స్ఫూర్తితో మెగా బ్లడ్ డోనర్ కొడపత్రి శ్రావణ్ 56వ సారి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన, 45 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి యువతి, యువకుడు రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకరు ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణదానంగా మారుతుందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

ఈ రక్తదాన శిబిరంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన రక్తదాతలు, యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, మానుపాటి శ్రీకాంత్, బెజ్జంకి నరేష్, పెర్క నీరజ్, బండి శ్రీకాంత్, బత్తిని అనిల్, కొడపత్రి శ్రావణ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply