అనారోగ్య బాధితుడికి రూ.2 లక్షల ఎల్‌ఓసీ..
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కొండాపూర్ మండలం తొగర్‌పల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రూ.2 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) అందజేశారు. చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చులు అవసరమవుతుండటంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. సదాశివపేటలోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆకాంక్షించారు. ఆపద సమయంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, పార్టీ జనరల్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, సదాశివపేట మండల పార్టీ అధ్యక్షుడు గొల్ల అంజన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రోళ్ల రవి, సైదాపూర్ సర్పంచ్ రామగౌడ్, మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, టెంటు బాలు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రచిత్, గంగయ్య, అమీర్, హానక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
