25 ఏళ్లకే ప్రపంచ ఏఐ రంగంలో సంచలనం.. ఎవరీ అమన్ సాంగర్ !!
- స్పేస్‌ఎక్స్ దృష్టిని ఆకర్షించిన అమన్ సాంగర్
- ఫార్చ్యూన్-500లో 64% కంపెనీల నమ్మకాన్ని గెలుచుకున్న ఏఐ వేదిక
- 50 వేలకుపైగా టెక్ బృందాలు వినియోగిస్తున్న ‘కర్సర్’
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : చిన్న వయసులో ప్రారంభమైన ఆసక్తి.. ఇప్పుడు ప్రపంచ టెక్ రంగాన్ని కుదిపేస్తున్న విజయగాథగా మారింది. భారత సంతతికి చెందిన యువ పారిశ్రామికవేత్త అమన్ సాంగర్ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకున్న అమన్, తన స్నేహితులతో కలిసి స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సంస్థ అనీస్ఫియర్ (Anysphere) ఇప్పుడు టెక్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించింది.

అమన్ సాంగర్ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్న ఈ ఏఐ స్టార్టప్‌ను, అమెరికా అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX) కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం విలువ ఏకంగా 60 బిలియన్ డాలర్లు (సుమారు రూ.5 లక్షల కోట్లు)గా ఉండటంతో ఈ డీల్ మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ కొనుగోలు ప్రక్రియ 2026 మూడో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) చెబుతుంది. ఈ డీల్ పూర్తయితే అనీస్ఫియర్ పూర్తిగా స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థగా మారనుంది.
ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ అభివృద్ధి రంగంలో అనీస్ఫియర్ రూపొందించిన టెక్నాలజీ.. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా ప్రోగ్రామర్ల పనిని సులభతరం చేసే అధునాతన ఏఐ కోడింగ్ టూల్స్ కారణంగా ఈ సంస్థ వేగంగా ఎదిగింది. భారత సంతతికి చెందిన యువకుడు ప్రపంచ టెక్ రంగంలో ఇంతటి భారీ ఒప్పందానికి కేంద్రబిందువుగా మారడం భారతీయులకు గర్వకారణంగా మారింది. 14 ఏళ్ల బాలుడిగా కోడింగ్ నేర్చుకున్న అమన్ సాంగర్.. ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఆశ్చర్యపరిచే ఘనత సాధించిన ఈ 25 ఏళ్ల యువకుడి ప్రయాణం కూడా అంతే ఆసక్తికరంగా ఉంది. అమన్ సాంగర్ తండ్రి అరవింద్ సాంగర్ ఐఐటీ బాంబేలో చదువుకున్నాడు.. హెడ్జ్ ఫండ్ రంగంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందారు. అమన్ తల్లి శిల్పా సాంగర్ ఆర్థోడాంటిస్ట్‌తో పాటు వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. చిన్నప్పటి నుంచే సాంకేతిక రంగంపై ఆసక్తి పెంచుకున్న అమన్, కేవలం 14 ఏళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ ఆసక్తే నేడు ప్రపంచ టెక్ రంగాన్ని ఆకర్షిస్తున్న బహుళ బిలియన్ డాలర్ల సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా అతడిని నిలబెట్టింది.
భారత సంతతికి చెందిన అమన్ సాంగర్, అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో చదువుకున్నాడు. ఆ సమయంలో అమన్ తన ముగ్గురు ఫ్రెండ్స్ మైఖేల్ ట్రూయెల్, సుఅలెహ్ ఆసిఫ్, ఆర్విడ్ లున్నెమార్క్‌లతో కలిసి 2022లో అనీస్ఫియర్ సంస్థను స్థాపించాడు. సంస్థ రూపొందించిన ‘కర్సర్’ (Cursor) అనే ఏఐ ఆధారిత కోడింగ్ వేదిక ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లను ఆకట్టుకుని సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ వేదికను లక్షలాది మంది ప్రోగ్రామర్లు వినియోగిస్తున్నారు.

అనీస్ఫియర్ సంస్థ ‘కర్సర్’ (Cursor) ఏఐ సాఫ్ట్‌వేర్ డెవలపర్ల పనిని మరింత వేగవంతం, సులభతరం చేసింది. సాధారణ ఏఐ కోడింగ్ టూల్స్‌లా కేవలం కోడ్ సూచనలు ఇవ్వడమే కాకుండా, మొత్తం కోడ్‌బేస్‌ను విశ్లేషించి అవసరమైన కోడ్‌ను స్వయంగా రూపొందించడం కర్సర్ ప్రత్యేకత. అంతేకాకుండా బగ్‌లను గుర్తించడం, కోడ్‌ను మెరుగుపరచడం, క్లిష్టమైన ప్రోగ్రామింగ్ సమస్యలకు పరిష్కారాలు సూచించడం వంటి సామర్థ్యాలతో ఇది ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లను ఆకట్టుకుంది.
కర్సర్ విజయాన్ని అంచనా వేయాలంటే దాని వినియోగదారుల జాబితానే ఉదాహరణ. ఎన్‌విడియా, అడోబ్, ఉబెర్, షాపిఫై, పేపాల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 50 వేలకుపైగా సాంకేతిక బృందాలు ఈ వేదికను వినియోగిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీల్లో 64 శాతం సంస్థలు కర్సర్ సేవలను ఉపయోగిస్తున్నట్లు అనీస్ఫియర్ వెల్లడించింది.
ఈ అసాధారణ వృద్ధితో కంపెనీ భారీగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. గత ఏడాది అనీస్ఫియర్ మార్కెట్ విలువ ఎకంగా 29.3 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఇప్పుడు స్పేస్‌ఎక్స్ కొనుగోలు ఒప్పందంతో ప్రపంచ ఏఐ రంగంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎగ్జిట్‌లలో ఒకటిగా నిలవబోతోంది.
ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో వేగంగా విస్తరిస్తున్న ‘వైబ్ కోడింగ్’ (Vibe Coding) ధోరణికి కర్సర్ ప్రధాన వేదికగా మారింది. సహజ భాషలో ఆదేశాలు ఇస్తే కోడ్ రూపొందించే ఈ సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించిన అమన్ సాంగర్.. ప్రపంచ ఏఐ రంగంలో అత్యంత ప్రభావశీల యువ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు.
