Betting App Promotion – సెల‌బ్రిటిల‌కు బిగుసుకుంటున్న ఉచ్చు – ఆత్మ‌హ‌త్య‌ల‌పై పోలీసులు ఆరా

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణలో సెల‌బ్రిటిల‌కు బెట్టింగ్ యాప్ కేసు ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్ప‌టికే 36 మంది పై కేసులు న‌మోద‌య్యాయి. పంజాగుట్ట పోలీసు స్టేష‌న్‌లో ప‌ద‌కొండు మందిపై, మియాపూర్ స్టేష‌న్‌లో 25 మందిపై కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌ను రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ళలతో పాటు మరో 20 మంది పై విచారణ కొనసాగుతోంది.

సెల‌బ్రిటీల ప్ర‌చారం వ‌ల్లే…
సెలబ్రిటీల ప్రచారం వల్ల బెట్టింగ్ యాప్‌ల ప్రభావం పెరిగిందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, ఆర్థికంగా నష్టపోయిన అనేక మంది యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ యాప్‌ల వలన భారీగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని తేలింది. గత ఏడాది కాలంలో ఈ బెట్టింగ్ యాప్‌ల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఇప్పటివరకు 15 కేసులను నమోదు చేసి, బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. బాధితుల కుటుంబసభ్యులను ప్రశ్నించి, అసలు ఈ యాప్‌లు ఎలా పనిచేస్తున్నాయి, వీటి వ‌ల్ల మోసపోయిన వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య‌పై క్లారిటీ లేదు
సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడిషనల్ ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై సరైన క్లారిటీ లేదన్నారు. 2017 గెమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణాలో ఆన్లైన్ గెమింగ్ బ్యాన్ అయిందని, మొత్తం 108 ఇల్లీగల్ యూఆర్‌ఎల్‌ లను బ్లాక్ చేశామన్నారు. చైనీస్ యూఆర్‌ఎల్‌లను ఫాలో కాకుండా అనేక ఇల్లీగల్ యూఆర్ఎల్‌ లను పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు తమ మొబైల్స్ ద్వారా వచ్చే పాప్ అప్స్ పైన సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తే వాటిని బ్లాక్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. వేరు వేరు ప్రాంతలనుంచి ఫేక్ జీపీఎస్‌ ద్వారా జియో ఫెన్సింగ్ యాక్సెస్ జరుగుతుందని, స్కిల్ గేమింగ్ అని చెప్పే మాటలు అబద్దమని ఎస్పీ ప్రసాద్ అన్నారు. ఆన్లైన్ గెమింగ్ ద్వారా నష్టపోయిన ఒక్క గేమింగ్ కంపెనీ లేదని, గేమింగ్ కంపెనీ ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ వారు పన్నిన పన్నాగం మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. స్కిల్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. స్కిల్ గేమ్ నాన్ స్కిల్ గేమ్స్ తో సంబంధం లేదు.. ప్రతి ఆన్లైన్ గేమ్ వలన నష్టాలు ఉన్నాయని, స్కిల్ గేమ్స్, నాన్ స్కిల్ గేమ్స్ పైన లీగల్ అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. భారత చట్టాల ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *