APL | వైజాగ్ విజయభేరి
- సీజన్లో అమరావతికి మొదటి ఓటమి
- హనీష్, మహిప్ మెరుపులు..
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హనీష్ వీరారెడ్డి
- ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వైజాగ్ ఘన విజయం
కడప, ఆంధ్రప్రభ : ఏపీఎల్-2026 సీజన్-5లో సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కడప వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో విజయం సాధించి సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇదే సమయంలో అమరావతి జట్టుకు ఈ సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న వైజాగ్ లయన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరినా, హనీష్ వీరారెడ్డి, మహిప్ కుమార్ జట్టును ఆదుకున్నారు. హనీష్ కేవలం 34 బంతుల్లో 62 పరుగులు చేసి 8 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆకట్టుకోగా, మహిప్ కుమార్ 41 బంతుల్లో 62 పరుగులు చేసి 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. చివర్లో ధనుష్ 14 బంతుల్లో 36 పరుగులతో మెరుపులు మెరిపించడంతో వైజాగ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అమరావతి బౌలర్లలో టోషిత్ యాదవ్ రెండు వికెట్లు తీసి రాణించగా, శశికాంత్, వర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ 42 పరుగులు, గిరినాథ్ 37 పరుగులతో పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వైజాగ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు అమరావతి జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది.
వైజాగ్ బౌలర్లలో ప్రమోద్ మూడు వికెట్లు, గిరినాథ్ మూడు వికెట్లు తీసి విజయాన్ని ఖాయం చేశారు. బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హనీష్ వీరారెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
