T20 | ఓపెనర్ల విధ్వంసం.. శ్రీలంకపై టీమిండియా డామినేష‌న్..

T20 | ఓపెనర్ల విధ్వంసం.. శ్రీలంకపై టీమిండియా డామినేష‌న్..

  • క్లీన్ స్వీప్‌పై కన్నేసిన భారత్
  • టీ20ల్లో టీమిండియా ప్రపంచ రికార్డు
  • మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టిన స్మృతి మంధాన

తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన నాలుగో టీ20లో భారత మహిళా జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి శ్రీలంకపై 30 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 4-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించడమే కాకుండా, మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డులను లిఖించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు స్మృతి మంధాన (80), షెఫాలీ వర్మ (79) శ్రీలంక బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ తొలి వికెట్‌కు 162 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో రీచా ఘోష్ కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు చేసి స్కోరును పరుగులు పెట్టించింది.

ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన మైలురాయిని చేరుకుని చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆమె, ఈ ఘనతను అత్యంత వేగంగా (281 ఇన్నింగ్స్‌లలో) సాధించిన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దాంతో మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డును స్మృతి అధిగమించింది.

మరోవైపు, 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కూడా అద్భుతంగా పోరాడింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (52) హాఫ్ సెంచరీతో రాణించింది. దీంతో శ్రీలంక తన టీ20 చరిత్రలోనే అత్యధిక స్కోరు (191/6) నమోదు చేసినప్పటికీ, భారత బౌలర్ల ధాటికి విజయాన్ని అందుకోలేకపోయింది. అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ చెరో రెండు వికెట్లతో శ్రీలంకను కట్టడి చేశారు.

అయితే, భారత్ ఘనవిజయం సాధించినప్పటికీ, ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు చేజార్చడం ఆందోళన కలిగించే అంశంగా మిగిలింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు కేవలం 166 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో, టీమిండియా తన ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి ఈ విజయ ఉత్సాహంలో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన, మంగళవారం (డిసెంబర్ 30) జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అద్భుతమైన ఏడాదిని విజయంతో ముగించాలని భారత అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు.

Leave a Reply