100 వాహనాలు స్వాధీనం..

100 వాహనాలు స్వాధీనం..

ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అడవుల నరికివేత, కలప స్మగ్లింగ్, గంజాయి రవాణా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పేరున్న ” కేశవపట్నం” మారుమూల అటవీ ప్రాంతంలో ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) ఆకస్మికంగా సందర్శించారు.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మారుమూల గ్రామమైన కేశవపట్నం(Kesavapatnam)లో ఈ రోజు భారీ వర్షాన్నిలెక్కచేయకుండా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పి కాజల్ సింగ్(Kajal Singh), డీఎస్పి ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో 160 మంది పోలీసులతో చేపట్టిన కార్డెన్ సెర్చ్(Carden Search)తో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

మారుమూల గ్రామమైనప్పటికీ పోలీసుల ఆకస్మిక తనిఖీ(inspection)ల్లో సరైన పత్రాలు లేని 82 మోటర్ బైక్లు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనాన్నిపోలీసులు స్వాధీనపరచుకున్నారు. 90 నివాస గృహాలు కూడా లేని కేశవపట్నంలో గడిచిన ఐదేళ్లలోనే రౌడీ షీటర్లు, పీడీ యాక్ట్(PD Act)తో జైలుకెళ్లిన నేరస్తులు, అసాంఘిక కార్యకలాపాలతో నేర ప్రవృత్తి కలిగి ఉన్నమొత్తం 90 మందిపై పోలీసుల కేసులు న‌మోదైన‌ట్లు ఎస్పీ తెలిపారు. నేర చరిత్రకు అడ్డాగా పేరు ఉన్నకేశవపట్నం పేరు పూర్తిగా తుడిచివేసి, సత్ప్రవర్తనతో సామాజిక మార్పు తీసుకురావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

నేరాలకు దూరంగా ఉండాలి..

పర్యావరణానికి హాని కలిగించే అడవుల నరికివేత, కలప స్మగ్లిం(Smuggling)కు ఇకపై ఫుల్ స్టాప్ పెట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ.. మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా నేర చరిత్ర మానాలని, సన్మార్గంలో నడిస్తేనే సమాజం బాగుపడుతుందని వివ‌రించారు. లేదంటే మీ పిల్లలు కూడా నేర ప్రవృత్తిని ఎంచుకొని సమాజానికి తీరని ద్రోహం చేస్తారని హెచ్చరించారు.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు తప్పనిసరిగా బడికి పంపాలని, మహిళల పట్ల గౌరవంగా ఉండాలని ఎస్పీ గీత బోధ(Geetha Bodha) చేశారు. ఈ గ్రామంలో గృహహింస కేసులు కూడా పెరుగుతున్నాయని నేర చరిత్ర లేకుండా గ్రామం కలసికట్టుగా ఉండాలని అన్నారు. నేరాలు మానితే ఏడాది కాలం పాటు చూసి రౌడీ షీట్లు, క్రిమినల్(Criminal) కేసులు ఎత్తివేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ స్పెషల్ డ్రైవ్ లో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, పుట్కూరు సీఐ ఎం ప్రసాద్, ఎస్సైలు వీ .పురుషోత్తం, సాయన్న, ఇమ్రాన్, రాధిక, శ్రీకాంత్, పూజ, అన్వర్ ఉల్ హక్ పాల్గొన్నారు.