గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఐదుగురు అరెస్ట్

ఒడిశా నుంచి నల్గొండకు గంజాయి తరలింపు

  • 2.240 కిలోల గంజాయి, బాలెనో కారు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
  • రూ.1.12 లక్షల విలువైన గంజాయి, రూ.1,500 నగదు జప్తు.
  • సీఐ ఎల్. పవన్ కుమార్ వెల్లడి.

మరిపెడ, ఆంధ్రప్రభ: ఒడిశా నుంచి నల్గొండ జిల్లాకు గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులను మరిపెడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 2.240 కిలోల ఎండు గంజాయి, ఒక మారుతీ సుజుకీ బాలెనో కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం మరిపెడ ఎస్‌ఐ గండ్రాతి సతీష్, పోలీసు సిబ్బంది ఇస్లావత్ రవీందర్, రమేష్, వెంకన్న, మహిళా కానిస్టేబుల్ శాంతతో కలిసి పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ సమయంలో వేగంగా వచ్చిన ఒక మారుతీ సుజుకీ బాలెనో కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, అందులో ఉన్నవారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు కారును నిలిపివేసి తనిఖీ చేయగా డ్రైవర్ సీటు కింద ఎండు గంజాయి ప్యాకెట్ లభించింది.

స్వాధీనం చేసుకున్న గంజాయి బరువు 2 కిలోల 240 గ్రాములుగా తేలింది. అరెస్టయిన వారు **గండికోట వంశీ (24), చిత్రం రాకేష్ (22), చింతల తిరుమలేష్ (24), కంచి మహేష్ (25), మాదాసు మహేష్ (26)**గా గుర్తించారు. వీరంతా నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన కనగల్ గ్రామ వాసులని పోలీసులు తెలిపారు.

నిందితులు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో నల్గొండలో సెల్ఫ్ డ్రైవ్‌కు కారును అద్దెకు తీసుకుని ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, నల్గొండలో విక్రయించేందుకు తరలిస్తుండగా మరిపెడలో పట్టుబడ్డారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ ఎల్. పవన్ కుమార్ మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు లేదా రవాణా గురించి సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు తగిన పారితోషికం కూడా అందజేస్తామని తెలిపారు.