విజయవాడలో పీవీఎల్ ఓపెన్ ట్రయల్స్‌కు శ్రీకారం

గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభ వెలికితీయడమే లక్ష్యమన్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాలీబాల్ క్రీడాభివృద్ధికి దీర్ఘకాలిక కార్యాచరణను హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి తొలి అడుగుగా విజయవాడలో పీవీఎల్ ఓపెన్ ట్రయల్స్, అండర్-21 ఆటగాళ్ల ఎంపిక (ట్రయల్స్) నిర్వహించింది. గురువారం ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లోని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ ట్రయల్స్ ఉత్సాహంగా సాగాయి.

ఈ సందర్భంగా పీవీఎల్ ఓపెన్ ట్రయల్స్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ క్రీడా, రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సంస్థ గత నాలుగేళ్లుగా చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి వాలీబాల్ అభివృద్ధికి సంస్థ చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

శాప్ చైర్మన్ ఎ. రవి నాయుడు మాట్లాడుతూ, విజయవాడలో పీవీఎల్ ట్రయల్స్ నిర్వహించిన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తొలి దశలో జిల్లాలో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో, అనంతరం ప్రతి మండలంలో వాలీబాల్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన బ్లాక్ హాక్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. అలాగే వచ్చే సీజన్ పీవీఎల్ పోటీలను విజయవాడలో నిర్వహించాలని కోరారు.

ఈ సందర్భంగా కేఎస్‌జీ వ్యవస్థాపకుడు, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రధాన యజమాని అభిషేక్ రెడ్డి కంకనాల మాట్లాడుతూ, దీర్ఘకాలిక కార్యాచరణలో భాగంగా ప్రతి ఏడాది టాలెంట్ హంట్ నిర్వహించడం, జిల్లా, గ్రామీణ స్థాయి టోర్నమెంట్‌లకు మద్దతు ఇవ్వడం, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కోచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం, ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ప్రొఫెషనల్ స్థాయి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి జిల్లాలో రెండు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, ముఖ్యంగా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే వాలీబాల్‌పై ఆసక్తి పెంపొందించే దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఒక్క సంస్థతోనే బలమైన క్రీడా వ్యవస్థను నిర్మించడం సాధ్యం కాదని, ప్రభుత్వం, క్రీడా సంఘాలు, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలను దేశంలోనే అత్యుత్తమ వాలీబాల్ కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు.

అండర్-21 ట్రయల్స్‌లో 105 మంది, పీవీఎల్ ఓపెన్ ట్రయల్స్‌లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓపెన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ నెల 17న గోవాలో జరిగే ఆటగాళ్ల వేలానికి ఎంపిక చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, శాప్ బోర్డు సభ్యుడు సంతోష్, దిగ్గజ వాలీబాల్ క్రీడాకారుడు, శాప్ డైరెక్టర్ ఎ. రమణరావు, టీడీపీ యువజన నాయకుడు బోడే వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ (FIVB) ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను భారతదేశ తొలి డివిజన్ ప్రొఫెషనల్ వాలీబాల్ లీగ్‌గా గుర్తించిన నేపథ్యంలో ఈ ప్రకటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ గుర్తింపుతో అర్హత సాధించిన భారతీయ క్లబ్‌లు సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ (CAVA), ఆసియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (AVC) ఆధ్వర్యంలోని అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో నిబంధనలకు అనుగుణంగా పాల్గొనే అవకాశం పొందనున్నాయి.