Telangana Tourism | భువనగిరి-కొలనుపాక పర్యాటక సర్క్యూట్‌కు కొత్త ఊపు

Telangana Tourism | భువనగిరి-కొలనుపాక పర్యాటక సర్క్యూట్‌కు కొత్త ఊపు

Telangana Tourism | భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యం
అక్టోబర్ 2లోపు పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశం
స్వదేశ్ దర్శన్ 2.0 కింద రూ.56.81 కోట్ల అభివృద్ధి ప్రణాళిక

Telangana Tourism | యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా భువనగిరి కోటను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కోట, ఆలేరు మండలంలోని కొలనుపాక సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకొని క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు.

కోట కింద రోప్‌వే, హోటల్ నిర్మాణం, పార్కింగ్, రెస్ట్‌రూమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రాక్ గార్డెన్, విద్యుత్ దీపాల అలంకరణ వంటి పనులతో పాటు, కొండపై కోట పునరుద్ధరణ, కేఫెటీరియా, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, మెట్ల పునరుద్ధరణ, ఎంట్రన్స్ ప్లాజా, టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా పనుల్లో జరిగిన జాప్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ, అక్టోబర్ 2 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే పగలు-రాత్రి అనే తేడా లేకుండా పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యమన్నారు. యాదాద్రిలోని భువనగిరి కోట, కొలనుపాకలను అనుసంధానిస్తూ సమగ్ర పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి జరుగుతోందన్నారు. స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0 కింద రూ.56.81 కోట్ల వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, పురావస్తు శాఖ డైరెక్టర్ డా. అర్జున్ రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

కొలనుపాకలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన సోమేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణితో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.