Sensex | సెన్సెక్స్ లాభాల్లో, నిఫ్టీ నష్టాల్లో…

Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం మిశ్రమ ధోరణిలో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని పరిణామాలు, ముడి చమురు ధరల మార్పులు, అమెరికా మార్కెట్ల కదలికల ప్రభావం భారత ఈక్విటీ మార్కెట్లపై కనిపిస్తోంది.

ఉదయం ప్రారంభ‌ సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 163 పాయింట్లు లాభపడి 78,805 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ మాత్రం 161 పాయింట్లు నష్టపోయి 24,615 వద్ద కొనసాగుతోంది. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్లు, అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు పరస్పర విరుద్ధంగా కదులుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్‌ 99.99 స్థాయిలో కొనసాగుతోంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌ 4.68 శాతానికి చేరింది.ముడి చమురు మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 84.7 డాలర్ల వద్ద ఉంది. చమురు ధరల కదలికలు ద్రవ్యోల్బణ అంచనాలు, మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, గత సెషన్‌లో అమెరికా మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేశాయి. ఎస్‌అండ్‌పీ 1.48 శాతం పెరగగా, నాస్‌డాక్ సూచీ 2.13 శాతం పుంజుకుంది. అమెరికా మార్కెట్ల సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కొంత మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అంతర్జాతీయ పరిణామాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. రానున్న సెషన్లలో ప్రపంచ మార్కెట్ల కదలికలు సూచీల గమనాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.