భారీ వర్షాలతో నిండుకుండలా మారిన కోట్పల్లి ప్రాజెక్ట్
వికారాబాద్, ఆంధ్రప్రభ: జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో మధ్యతర ప్రాజెక్టు అయిన కోట్పల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు దాదాపు నిండుకుండలా మారగా, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నిండి అలుగు పారే అవకాశం ఉందని స్థానికులు, నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో అత్యధికంగా కొడంగల్‌లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు అన్ని మండలాల్లో కురిసిన వర్షాలతో రైతుల్లో ఆనందం నెలకొంది. కోట్పల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే సమీపంలోని దారూర్, పెద్దేముల్ మండలాలకు సాగునీరు అందే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
