క్యాతనపల్లి కమిషనర్‌ను బదిలీ చేయాలి

అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకుల విమర్శలు

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణను వెంటనే బదిలీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కమిషనర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులను గౌరవించడం లేదని ఆరోపించారు.

మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, కంబగోని సుదర్శన్ గౌడ్, రామిడి కుమార్ మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనర్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లను గౌరవించడం లేదని, వారి తీర్మానాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వార్డుల్లో సమస్యలను పలుమార్లు ప్రస్తావించినా స్పందించడం లేదని ఆరోపించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే అధికారిని బదిలీ చేశారని, ఇప్పుడు మళ్లీ ఇక్కడికి నియమించారని ఆరోపించారు. చెన్నూరులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని ఎందుకు నియమించారని మంత్రి వివేక్‌ను ప్రశ్నించారు.

కమిషనర్ ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, తమ ఫిర్యాదుపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

ఇంటి నిర్మాణాలకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేస్తే ప్రజలు చైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాలని సూచించారు. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే కమిషనర్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భూమన్న గౌడ్, వేనంక శ్రీను, కృపానందం, బొబ్బర స్వర్ణలత, సీనియర్ నాయకులు రామిడి కుమార్, గడ్డం రాజు, రామిడి లక్ష్మీకాంత్, కొండ కుమార్, వేముల వెంకటేష్, ఆర్నె సతీష్ తదితరులు పాల్గొన్నారు.