Markapuram | పెద్దపులి మృతి కేసులో ఇద్దరి అరెస్ట్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో వేగవంతమైన దర్యాప్తు
Markapuram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ డివిజన్ పరిధిలోని రాచర్ల బీట్లో జరిగిన పెద్దపులి మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరుకు చెందిన అంజి, నంద్యాల జిల్లాకు చెందిన వీరాంజనేయులను గుంటూరు జిల్లా మేడికొండూరులో అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం గిద్దలూరుకు తరలించారు.
సుమారు 20 రోజుల క్రితం గుండ్లకమ్మ అటవీ ప్రాంతంలో ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి మృతి చెందింది. అనంతరం కొందరు దుండగులు పులి కాళ్లను నరికి గోళ్లను తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించి, పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు చేపట్టాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పులి సహజ మరణమా, వేటగాళ్ల దుశ్చర్యా, లేక విషప్రయోగమా అనే అన్ని కోణాల్లో విచారణ జరపాలని సూచించారు.
డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేయగా, ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
