డీఏలు, పీఆర్‌సీ అమలు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం

సెప్టెంబర్ 1లోగా హామీలు అమలు చేయాలని పీఆర్టీయూటీఎస్ హెచ్చరిక

టేకుమట్ల, ఆంధ్రప్రభ : సెప్టెంబర్ 1లోగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏలు, పీఆర్‌సీని అమలు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పీఆర్టీయూటీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్‌కుమార్ హెచ్చరించారు.

సోమవారం టేకుమట్ల మండలంలో నిర్వహించిన పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కొట్టే ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ముత్యం రెడ్డి, వంతడుపుల రఘు, మండల కార్యదర్శి పృథ్విరాజ్, కేజీబీవీ మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీలత, ఉపాధ్యాయులు, మండల నాయకులు పాల్గొన్నారు.