గుండెపోటు బాధితులకు ‘టెనెక్ట్ ప్లస్’ వరం

  • మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులోకి..
  • ఉచితంగా రూ.45 వేల విలువైన అత్యవసర ఇంజక్షన్
  • సూపరింటెండెంట్ డాక్టర్ కె.పి. చారి

మాచర్ల, ఆంధ్రప్రభ: గుండెపోటు బాధితులకు ప్రాణదాతగా నిలిచే ‘టెనెక్ట్ ప్లస్’ ఇంజక్షన్ ప్రస్తుతం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని, ఈ ఇంజక్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని మాచర్ల ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.పి. చారి తెలిపారు. సుమారు రూ.45 వేల విలువైన ఈ అత్యవసర ఇంజక్షన్‌ను ప్రభుత్వమే ఉచితంగా అందించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊరట కలుగుతోందన్నారు.

సోమవారం ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే గుండె సంబంధిత వ్యాధులు ప్రస్తుతం మారిన జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో యువతలోనూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే బాధితుడిని సమీప ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువస్తే, వైద్యుల సూచన మేరకు సరైన సమయంలో టెనెక్ట్ ప్లస్ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు.

గుండెపోటు వచ్చిన తొలి గంటను వైద్యపరంగా గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారని, ఆ సమయంలో ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో ఏర్పడిన గడ్డ కరిగి రక్తప్రసరణ పునరుద్ధరించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఇప్పటికే మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో పలువురు గుండెపోటు బాధితులకు ఈ ఇంజక్షన్ అందించి వారి ప్రాణాలను కాపాడినట్లు డాక్టర్ కె.పీ. చారి తెలిపారు. ఈ ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం రోగిని అవసరమైతే మెరుగైన వైద్యసేవలు అందించే ప్రత్యేక ఆసుపత్రికి సురక్షితంగా తరలించేందుకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.ప్రజలు గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయించాలని సూచించిన ఆయన, ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల అత్యవసర వైద్య సదుపాయాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుని విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.