మంగళగిరి రైల్వే స్టేషన్‌కు నూతన శోభ..
- యువతకు ఉపాధే లక్ష్యమని నారా లోకేష్
మంగళగిరి, ఆంధ్రప్రభ: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.12.56 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో భారతీయ రైల్వేల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆధునిక రైల్వే స్టేషన్లు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని, మౌలిక సదుపాయాల విస్తరణతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మంగళగిరికి కొత్త పరిశ్రమలను తీసుకువచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.

