మక్తల్‌లో వీధి కుక్కల సమస్యపై బీజేపీ వినతి

తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతోందని, ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు చేపట్టి వాటిని పట్టణం నుంచి తరలించాలని కోరుతూ పట్టణ బీజేపీ నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హన్మంతుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా మారిందని, దీనిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

గత నెల 29న పదిమందికి పైగా ప్రజలు వీధి కుక్కల దాడికి గురయ్యారని పేర్కొన్నారు. బాధితుల్లో కొందరు నారాయణపేట జిల్లా ఆసుపత్రి, మరికొందరు మహబూబ్‌నగర్, రాయచూర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా, ఇంకొందరు స్థానికంగా చికిత్స చేయించుకున్నట్లు వివరించారు.

ఘటన జరిగిన రోజే మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించామని, కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని తెలిపారు. అనంతరం ప్రత్యక్షంగా కలిసి విద్యార్థులపై కూడా కుక్కల దాడి ప్రమాదం ఉందని వివరించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

ప్రతిరోజూ ప్రజలు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు వీధి కుక్కల బారిన పడుతున్నారని, కౌన్సిల్ సమావేశం పేరుతో సమస్యను వాయిదా వేయడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెల్లవారుజామున విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాఠశాలలకు వెళ్లే నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

వీలైనంత త్వరగా వీధి కుక్కలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన వైద్య చికిత్స అందించి, ప్రజలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరఫున బీజేపీ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రాజశేఖర్ రెడ్డి, పీకే నరసింహ, టప్ప కృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బి. భరత్, నాయకులు బ్యాటరీ రాజు, కె. నరేందర్, మహేష్ సాగర్, శ్రీకాంత్, మంజునాథ్, ఆంజనేయులు, నవీన్, జావిద్, అశోక్, గోవిందు, భీమేష్, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.