మార్కెట్ గోదాంలోని వరి ధాన్యాన్ని తరలించాలని వినతి

లక్క పురుగులు, ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు కౌన్సిలర్ విజ్ఞప్తి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ గోదాంలో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని తక్షణమే ఇతర ప్రాంతాలకు తరలించి, మార్కెట్ యార్డ్‌లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పూర్తిగా తొలగించాలని 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

గోదాంలో భారీగా ధాన్యం నిల్వ ఉంచడం వల్ల పక్కనే ఉన్న 17, 18వ వార్డులలోని ఇళ్లలోకి లక్క పురుగులు వస్తున్నాయని ఆమె తెలిపారు. అవి ఆహార పదార్థాల్లో పడుతూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయని, ముఖ్యంగా రాత్రి వేళల్లో చిన్నపిల్లలు, వృద్ధులు నిద్రపోలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

అదేవిధంగా ధాన్యం శుభ్రపరిచే సమయంలో ఎగిసే దుమ్ము, ధూళి కారణంగా స్థానికులు డస్ట్ అలర్జీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మార్కెట్ యార్డ్ చుట్టూ అధిక సంఖ్యలో నివాస గృహాలు ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోదాంలోని ధాన్యాన్ని వెంటనే తరలించి, కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.