అంకిరెడ్డిగూడెంలో బెల్ట్ షాపులు, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక కమిటీ

అక్రమంగా మద్యం, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: చౌటుప్పల్ ఎస్‌ఐ నరసింహారెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం యాంటీ డ్రగ్స్, బెల్ట్ షాపుల (గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాల) నిర్మూలన కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి చౌటుప్పల్ ఎస్‌ఐ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కమిటీ సభ్యులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ నరసింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణ పూర్తిగా అరికట్టాలని, ఎలాంటి అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై ప్రజలు, కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

గ్రామంలోని వ్యాపారులందరితో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సర్పంచ్‌కు సూచించిన ఆయన, నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా మద్యం లేదా గంజాయి విక్రయాలు జరిపితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, అంకిరెడ్డిగూడెంను మద్యపాన, మాదకద్రవ్యాల రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కమిటీ సభ్యులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు సందీప్, యాంటీ డ్రగ్స్, బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు నల్ల జయప్రద, బొల్లు అండాలు, ముద్దం భారతి, భీమగోని మల్లేశం గౌడ్, మోడం ముత్తయ్య గౌడ్, పర్నే శ్రీధర్ రెడ్డి, ఇటికాల నర్సిరెడ్డి, పర్ని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.