రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారుల తనిఖీలు
ఫిర్యాదుల నేపథ్యంలో ధాన్యం, బియ్యం నిల్వల పరిశీలన
కామారెడ్డి, ఆంధ్రప్రభ: కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామ శివారులో ఉన్న ఓ రైస్ మిల్లులో సోమవారం సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఓఎస్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి.
అధికారులు మిల్లులోని ధాన్యం, బియ్యం నిల్వలను పరిశీలించారు. రికార్డుల్లో నమోదైన వివరాలతో స్టాక్‌ను సరిపోల్చి తనిఖీ చేశారు. అనంతరం తనిఖీ నివేదికను సంబంధిత సివిల్ సప్లై అధికారులకు సమర్పించారు.
రైస్ మిల్ యజమానుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న విభేదాల నేపథ్యంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. ఆ ఫిర్యాదుల ఆధారంగానే సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా రైస్ మిల్ యజమాని భూమేష్ గుప్తా మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా ఎలాంటి నిబంధనల ఉల్లంఘన చేయలేదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఫిర్యాదుల కారణంగానే అధికారులు తనిఖీలకు వచ్చారని పేర్కొన్నారు. మిల్లులోని స్టాక్‌కు సంబంధించిన అన్ని బిల్లులు, రికార్డులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. భాగస్వాముల మధ్య తలెత్తిన విభేదాల కారణంగానే ఈ ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.
