దివి గాంధీకి దివ్య ఖ్యాతి…
- సేవా పరమావధిగా కొనసాగిన జీవిత ప్రయాణం
- పదువుల కంటే ప్రజా సేవకే ప్రాముఖ్యత
- యువజన నాయకుడి నుంచి రాష్ట్ర నేతగా ఎదిగిన మండలి
- దివిసీమ పునర్నిర్మాణంలో తనదైన ముద్ర వేసిన మండలి
- రేపు మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకల ముగింపు
- అధికార కార్యక్రమంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
(ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో ) : గాంధీజీ చూపించిన శాంతి మార్గం, అహింసా ఆలోచనలను గుండెల నిండా నింపుకున్న దివిసీమ గాంధీకి రాష్ట్ర స్థాయిలో దివ్యమైన ఖ్యాతి లభించింది. ప్రజల కోసం సేవ చేసే మహనీయులు అరుదుగా కనిపిస్తుంటారు. కృష్ణా జిల్లాలో చిట్టచివరి నియోజకవర్గం అవనిగడ్డ. ఈ నియోజకవర్గ అభివృద్ధికి తనదైన ముద్ర వేయటంతోపాటు దివిసీమ ఉప్పెన సమయంలో ప్రజా సేవ కోసం తన పదవీని సైతం వదులుకోవటానికి సిద్ధపడిన మహనీయుడు మాజీ మంత్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు. మహాత్మాగాంధీ ఆశయాలు పుణికిపుచ్చుకుని, తెలుగు భాషా వికాసం కోసం విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి పార్లమెంట్ మెంబర్గా, రాష్ట్ర మంత్రిగా ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారు.
మండలి వెంకట కృష్ణారావు జీవిత ప్రస్థానం :
గాంధీజీ మార్గంలో నడిచి రాష్ట్ర రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న మండలి వెంకట కృష్ణారావు 1926 ఆగస్టు 4న కైకలూరు తాలూకా పల్లెవాడ గ్రామంలో ఉపాధ్యాయుడు మండలి వెంకట్రామయ్య – మహంకాళమ్మ దంపతులకు జన్మించారు. పల్లెవాడలో జన్మించిన మండలి వెంకట కృష్ణారావు తండ్రి వెంకట్రామయ్య అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, పల్లెవాడ, భావదేవరపల్లిలోని ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం మచిలీపట్నం హిందూ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తూనే రాజకీయాల్లో తొలి అడుగులు వేశారు. గాంధీ ప్రబోధాలకు ఆకర్షితులైన మండలి వెంకట కృష్ణారావు 1942లో జాతీయ విద్యార్థి సంఘంలో క్రియాశీలక సభ్యుడిగా చేరి క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకున్నారు. 1945లో జిల్లా విద్యార్థి కాంగ్రెస్ నిర్వహక కార్యదర్శిగా తొలి రాజకీయ పదవీ అధిరోహించిన మండలి వెంకట కృష్ణారావు 1946లో డిటెన్షన్ వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకున్నారు.

రాష్ట్ర నేతగా ఎదిగిన మండలి :
మహాత్మాగాంధీ ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన మండలి వెంకట కృష్ణారావు 1948 నుంచి 52 మధ్య కాలంలో కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేసి అంచెలంచెలుగా రాష్ట్ర నేతగా ఎదిగారు. 1952 నుంచి 56 వరకు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేసిన మండలి వెంకట కృష్ణారావు 1957లో మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో దరావత్తు చెల్లించేందుకు కూడా స్థోమత లేని ఓ దిగువ మధ్య తరగతి యువకుడు ఎంపీగా పోటీ చేయటమే ఓ చరిత్ర అయితే ఆ ఎన్నికల్లో ఆయన అఖండ మెజార్టీతో విజయం సాధించి మచిలీపట్నం రేవు అభివృద్ధికి, దివి ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారు. 1963 నుంచి 69 వరకు కృష్ణా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షునిగా, జిల్లా వ్యవసాయ అభివృద్ధి సంఘ అధ్యక్షులుగా పని చేసిన ఆయన 1969 నుంచి 72 వరకు అవనిగడ్డ పంచాయతీ సమితి అధ్యక్షులుగా దివి తాలూకా అభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఎంపీగా, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా, సమితి అధ్యక్షులుగా మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలకు గుర్తింపుగా 1972 ఎన్నికల్లో ఆయన అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, ఆ ఎన్నిక ఏకగ్రీవం కావటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన సాంఘిక సంక్షేమ, మత్స్య పరిశ్రమల శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా సమైక్యతా వాదమే తెలుగు ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందని నమ్మి సమైక్య రాష్ట్రం కోసం ఆయన పోరాడిన తీరు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. 1974లో జలగం వెంగళరావు మంత్రి వర్గంలో విద్యా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన ఆయన విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన హాయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలు నిర్మాణం కావటం విశేషం. 1978 లో జరిగిన ఎన్నికల్లో, 1983లో జరిగిన ఎన్నికల్లోనూ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మండలి వెంకట కృష్ణారావు 1997 సెప్టెంబరు 27న తుదిశ్వాస విడిచారు.
దివిసీమ పునర్నిర్మాణానికి విశేష కృషి :
దివిసీమ అభివృద్ధి కోసం మండలి వెంకట కృష్ణారావు చేసిన కృషి అనిర్వచనీయం. మండలి వెంకట కృష్ణారావు జీవితంలో 1977 ఉప్పెన ఓ కీలక సంఘటన. నాటి ఉప్పెనలో దాదాపు 10 వేల మందికి పైగా మృత్యువాత పడగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించి దివిసీమ మరుభూమిగా మారిపోగా, ఇక్కడ సహాయ పునరావాస కార్యక్రమాలకు తన మంత్రి పదవీ అడ్డుగా మారిందన్న భావనతో మంత్రి పదవీకి రాజీనామా చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన త్యాగాన్ని గుర్తించిన నాటి రాష్ట్ర ప్రభుత్వం పునరావాస శాఖను ప్రత్యేకంగా ఏర్పాటుచేసి దానికి మంత్రిగా మండలి వెంకట కృష్ణారావును నియమించగా, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన స్వచ్చంద సేవా సంస్థలను సమన్వయం చేసి కేవలం దశాబ్ద కాలం లోపే మరుభూమిగా మారిన దివిసీమను దివ్యసీమగా పునర్నిర్మించి దివిసీమ చరిత్రలో తనకంటూ సువర్ణ అధ్యాయం లిఖించుకున్నారు. ఆయన వారసుడు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తన చేసిన సేవలను ఎప్పుడు నెమరవేరుసుకుంటూ 1977లో జరిగిన సంఘటనలను విఫులంగా తెలియజేస్తుంటారు. తండ్రి చేసిన సేవ కార్యక్రమాలు మా జీవితంలో మరిచిపోలేమని తెలుపుతుంటారు.

గాంధీ ఆశయాలే ద్యేయంగా గాంధీ క్షేత్రం ఏర్పాటు :
మహాత్మాగాంధీ చేసిన ప్రబోధానికి ఆకర్షితులై అవనిగడ్డలో 1969లో గాంధీ క్షేత్రాన్ని స్థాపించి పేదరికం, నిరక్ష్యరాస్యత తొలగించేందుకు విశేష కృషి చేశారు. 340 మంది మత్స్యపారిశ్రామికుల బాలలతో ప్రభుత్వ ఆశ్రమపాఠశాల, 150 బాలబాలికలతో అనాథ శరణాలయం, 50 మందితో హిందీ ప్రచారక్ విద్యాలయం, 10 మందితో వికలాంగుల సంక్షేమ కేంద్రాలను ఇక్కడ నిర్వహించగా, వాటిలో శిక్షణ పొందిన వేలాది మంది ఉద్యోగులు గానూ, వ్యాపారులుగానూ స్వయం ఉపాధి రంగాల్లోనూ స్థిరపడి తమ జీవితాలను బాగు చేసుకున్నారు.
తెలుగుభాషా వికాసం కోసం విశేష కృషి :
తెలుగుభాషా వికాసం కోసం కృషి చేసిన వారి పేర్లలో అగ్రస్థానంలో ఉండే పేరు దివంగత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావుదే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1977లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను దిగ్విజయంగా నిర్వహించి తెలుగు ప్రజల నడుమ సమైఖ్యతను, సహృదభావాన్ని పెంపొందించేందుకు నాటి ప్రపంచ తెలుగు మహాసభలు బాటలు వేశాయి. నాటి ఆ సభలో తదనంతరం తెలుగుభాషా వికాసం కోసం కొన్ని వందల మంది కృషి చేసేందుకు ప్రేరణగా నిలుస్తాయని, నేటికీ పలువురు నాడు మండలి వెంకట కృష్ణారావుతో తాము కలసి పని చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. నాడు ఆయన చూపిన మార్గానే ఆయన కుమారుడు మండలి బుద్దప్రసాద్ కొనసాగిస్తూ తెలుగు భాషా వికాసం కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దివిసీమ అభివృద్ధిలో కీలక ఘట్టాలు :
అవనిగడ్డలో ముసిబ్ కోర్టు, ఫైర్ స్టేషన్, ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేయటంతోపాటు హంసలదీవి నుంచి గుల్లలమోద వరకు సముద్రపు కరకట్ట నిర్మించి 16 వేల ఎకరాల భూమిని కొత్తగా సాగులోనికి తీసుకొచ్చారు. మోపిదేవి- అయోధ్య ఏటి కట్టను నిర్మించి పది గ్రామాలకు వరద నీటి నుంచి రక్షణ కల్పించారు. దివిసీమ మత్స్య పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని అమలు జరిపి మత్స్య పరిశ్రమలకు అనేక సౌకర్యాలు కలుగజేశారు.
ఏడాది కాలంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు :
తెలుగు భాషా వికాసం కోసం, రాష్ట్ర సమైక్యత కోసం మండలి వెంకట కృష్ణారావు చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోనూ మండలి వెంకట కృష్ణారావు శతజయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయన శతజయంతి ముగింపు కార్యక్రమాలను అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాద్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, వారు మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ముగింపు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తూ జీవోను జారీ చేయటం ఆయన చేసిన కృషికి అందించిన గౌరవంగా చెప్పవచ్చు. ఆగస్టు 4వ తేదీన హైదరాబాద్, విజయవాడలో ప్రత్యేకంగా ఆయన శతజయంతి ముగింపు సభలు నిర్వహించనున్నారు. దివిసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం శతజయంతి ముగింపు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించటం పట్ల ఆయన కుమారుడు మండలి బుద్దప్రసాద్ విజయలక్ష్మి, కుమారుడు మండలి వెంకట్రామ్, కుటుంబసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
