ఉపాధ్యాయుని సేవలు ప్రశంసనీయం
పదవీ విరమణ సహజమే..
సేవలకు సమాజం గుర్తింపు దక్కాలి
జైనూర్, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయునిగా, ఎస్సీఆర్పీగా కనక బుచ్చిరామ్ అందించిన సేవలు ప్రశంసనీయమని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథరావు, ఆసిఫాబాద్ పీఎంఆర్సీ ఏసీఎంఓ ఆర్క ఉద్ధవ్, టీఎస్టిడబ్ల్యూటీయూ ఆశీర్వాద జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ అన్నారు.
సిర్పూర్ మండలం కంచనపల్లి క్లస్టర్ సీఆర్పీగా విధులు నిర్వహించిన కనక బుచ్చిరామ్ పదవీ విరమణ పొందిన సందర్భంగా ఆదివారం జైనూర్ మండల కేంద్రంలోని కేఆర్కే గార్డెన్లో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు బుచ్చిరామ్ దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి బుచ్చిరామ్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. విధులను అంకితభావంతో నిర్వర్తించి సహచరులతో కలిసి మెలిసి పనిచేసిన ఆయన పదవీ విరమణ అనంతరం కూడా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఏసీఎంఓ ఆర్క ఉద్ధవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజ ప్రక్రియేనని, ఉద్యోగ జీవితంలో అందించిన సేవలే వారికి శాశ్వత గుర్తింపుగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఆత్రం దేవలరావు, మాజీ ఎంపీపీ ఆత్రం లక్ష్మణ్, నాయకులు శ్యాంరావు, సలాం ప్రభాకర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
