బోనాల ఏర్పాట్లపై బండి సంజయ్ అసంతృప్తి
భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించలేదని ప్రభుత్వంపై విమర్శలు
హిందూ పండుగలకు మరింత నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారని, వర్షం వస్తే తడుస్తున్నారని పేర్కొన్నారు. తాగునీరు, షెడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు.
రంజాన్ పండుగకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, బోనాల ఉత్సవాలకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించిందని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లోని అనేక ఆలయాలకు తగిన స్థాయిలో నిధులు అందలేదని, ఒక్కో ఆలయానికి రూ.6 వేలైనా పూర్తిస్థాయిలో కేటాయించలేదని అన్నారు. హిందూ పండుగల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించిన ఆయన, గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ బోనాల ఏర్పాట్లు ఆశించిన స్థాయిలో లేవని విమర్శించారు. ప్రజాప్రతినిధులు దర్శనాలకు మాత్రమే పరిమితమవుతున్నారని, భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో హిందూ జనాభా అధికంగా ఉన్నందున, ఆ మేరకు హిందూ పండుగలకు కూడా తగిన నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.
