ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ .. ఖండించిన వైసీపీ నేతలు

  • విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా

చిప్పగిరి, ఆంధ్రప్రభ: ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిప్పగిరిలో ఆదివారం ఆందోళనకు దిగారు. అరెస్టు అక్రమమని ఆరోపిస్తూ ఎమ్మెల్యేను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నాయకులు శశికళ, చంద్రమోహన్, రామచంద్రరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై నమోదు చేసిన కేసులు, అరెస్టు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని వారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రతిపక్ష నాయకులపై వేధింపులు, కక్షసాధింపు చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆందోళన సందర్భంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.