Collector | వనరుల వినియోగం జరగాలి..

Collector | వనరుల వినియోగం జరగాలి..
- జిల్లా కలెక్టర్ సిరి
Collector | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వలయాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ), ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్టులు, అలాగే పరిపాలనలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వనరుల సమర్థ వినియోగం, వ్యర్థాల పునర్వినియోగం ద్వారా స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు వలయాకార ఆర్థిక వ్యవస్థ కీలకమని తెలిపారు. జిల్లాలో అమలు చేయదగిన పీపీపీ ప్రాజెక్టులను గుర్తించి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మౌలిక వసతులు, సేవల నాణ్యతను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే ప్రభుత్వ శాఖల పనితీరును మరింత వేగవంతం చేయడంలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలు, ప్రజలకు సత్వర సేవల అందుబాటు, పరిపాలనా పారదర్శకత పెంపు దిశగా ఏఐని వినియోగించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొని తమ శాఖల పరిధిలో అమలు చేయవచ్చిన ప్రణాళికలు, సూచనలను కలెక్టర్‌కు వివరించారు. జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
