పీజీఆర్ఎస్‌పై స్పందనకు ప్ర‌త్యేక క్యూఆర్ కోడ్

  • ఈ నెల 3న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

( విజయవాడ, ఆంధ్రప్రభ) : ఈ నెల 3వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని.. అదే విధంగా అర్జీదారులు త‌మ స్పంద‌న తెలియ‌జేసేందుకు ప్ర‌త్యేక క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌జ‌లు పీజీఆర్ఎస్ సేవలు పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అ భిప్రాయాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మంలో భాగంగా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని .. నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100 కి నేరుగా కాల్ చేయవచ్చని క‌లెక్ట‌ర్ సూచించారు.