ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా లక్ష్యం
నల్గొండ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ, ఆంధ్రప్రభ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా అందించడంతో పాటు ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఆదివారం నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 64 మంది లబ్ధిదారులకు రూ.64,07,424 విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇంటింటికి తాగునీరు అందించే లక్ష్యంతో ఇటీవల రూ.83 కోట్ల వ్యయంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి చేత శంకుస్థాపన చేయించామని తెలిపారు.
తాగునీటి సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.300 కోట్లను కేటాయించిందన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,000 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం 700 ఇళ్లను మంజూరు చేశామని, అర్హులై ఇంకా లబ్ధి పొందని వారు సొంత స్థలం ఉంటే ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజా ప్రభుత్వం పేదలు, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
అంతకుముందు సాయినగర్‌లో నిర్మాణంలో ఉన్న భారీ డ్రైనేజీ పనులను మంత్రి పరిశీలించారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే అమృత్-2 పథకం కింద చేపడుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, కార్పొరేటర్ రఫీ యుద్దీన్, తహసీల్దార్ పరుశురాం, ఎంపీడీవో యాకూబ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
