అగ్నిప్రమాదంలో మొక్కజొన్న, మామిడి చెట్లు దగ్ధం

అగ్నిప్రమాదంలో మొక్కజొన్న, మామిడి చెట్లు దగ్ధం
- కన్నీరు మున్నీరవుతున్న రైతు
టేకుమట్ల, ఆంధ్రప్రభ:
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే బూడిద అవ్వడంతో ఆ రైతు కన్నీరు మున్నీరవుతున్న హృదయ విదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గుమ్మడవెల్లి, కుందన్‌పల్లి, బండపల్లి గ్రామాల్లో చోటు చేసుకుంది. బండపల్లి గ్రామానికి చెందిన కనవేని రమేష్ అనే రైతుకు చెందిన 15 క్వింటాళ్ల మొక్కజొన్న పంటతో పాటు 20 మామిడి చెట్లు ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి.
బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. చేతికొచ్చిన మొక్కజొన్న పంటను కోసి కుప్ప వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కల రైతులు మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ వేసవి తీవ్రత వల్ల మంటలు అదుపులోకి రాలేదు. వారం రోజుల్లో పంటను అమ్ముకుని అప్పులు తీర్చుకుందామని ఆశపడ్డానని, చేతికి వచ్చే సమయంలో ఇలా పంటంతా బుగ్గిపాలవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతు రమేష్ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం స్పందించి తమలాంటి పేద రైతుకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు.
అధికారులను అప్రమత్తం చేసిన సిరికొండ మధుసూదనాచారి:
టేకుమట్ల మండలంలోని ఎంపేడు, కుందన్‌పల్లి, బండపల్లి తదితర గ్రామాల పంట పొలాల్లో అగ్నిప్రమాదం సంభవించి, మంటలు వేగంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తున్న విషయం తెలిసిన వెంటనే శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే జిల్లా ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు.
ఈ ఘటనపై భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఫైర్ అధికారులు , సింగరేణి జీఎంతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి పంపించాలని సూచించారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అవసరమైతే సింగరేణి విభాగం యొక్క సహాయాన్ని కూడా వినియోగించుకోవాలని కోరారు. ఎండల తీవ్రత కారణంగా అగ్ని మరింత విస్తరించి సమీప గ్రామాలకు నష్టం కలిగించే ప్రమాదం ఉన్నందున, అధికారులు యుద్ధప్రాతిపదికన అత్యవసర చర్యలు చేపట్టాలని సిరికొండ సూచించారు.
