ఉడుంపూర్ అటవీ కార్యాలయంపై దాడి..
17 మందిపై ఫిర్యాదు
విధులకు ఆటంకం, అధికారులపై దాడి చేశారంటూ కేసు కోరిన అటవీశాఖ
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ కార్యాలయంలో అధికారులను నిర్బంధించి, విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అటవీ అధికారులపై బండరాళ్లతో దాడి చేసి ప్రాణహానికి యత్నించారని ఆరోపిస్తూ రానిగ్రామానికి చెందిన 17 మందిపై కడెం పోలీస్ స్టేషన్లో ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ జి. శ్రీనివాస్‌రెడ్డి అటవీ సిబ్బందితో కలిసి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం, కార్యాలయంపై దాడి చేయడంతో సుమారు రూ.50 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బందిని అడ్డుకోవడంతో పాటు వారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా రాళ్లు రువ్వారని ఆరోపించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతంలోని ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో ట్రాక్టర్లతో దున్నడం నేరమని రైతులకు పలుమార్లు వివరించినప్పటికీ కొందరు వినకుండా దున్నుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో పోడు భూముల్లో ట్రాక్టర్లతో దున్నుతున్న వారిని అటవీ సిబ్బంది అడ్డుకున్నారని పేర్కొన్నారు.
దీంతో గ్రామానికి చెందిన కొందరు పోడు రైతులు, నాయకులు అటవీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులు పోలీసులను కోరారు.
