కాలువల్లోకి 1,450 క్యూసెక్కులు విడుద‌ల‌

రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్ నుంచి కాలువల్లోకి 1,450 క్యూసెక్కుల నీటి విడుదల
సాగునీటి లభ్యత పెరగడంతో రైతుల్లో ఆనందం

బాల్కొండ, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్ నుంచి ముప్కాల్ వరకు రివర్స్ పంపింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్ వద్ద నుంచి కి.మీ. 34 నుంచి కి.మీ. 0.0 వరకు ఒక పంపు ద్వారా సుమారు 1,450 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

పంపింగ్ ద్వారా విడుదలవుతున్న నీరు కాలువల్లోకి చేరుతుండటంతో ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి అందుబాటు మెరుగుపడనుంది. దీంతో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అవసరమైన నీరు సమృద్ధిగా లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ పంపింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అవసరాన్ని బట్టి అదనపు పంపులను కూడా వినియోగంలోకి తీసుకురావడంతో పాటు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.