Commissioner | పట్టణ శుభ్రత, పచ్చదనం కోసం కృషి చేయాలి

Commissioner | పట్టణ శుభ్రత, పచ్చదనం కోసం కృషి చేయాలి
Commissioner | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : పట్టణంలో పచ్చదనాన్ని విస్తరించడంతో పాటు శుభ్రత చర్యలను బలోపేతం చేయడానికి మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య(Golconda Narsaiya) ఈ రోజు పట్టణ నర్సరీ, కంపోస్ట్ యార్డును సందర్శించి పలు అంశాలను పరిశీలించారు.
కమిషనర్ ముందుగా నర్సరీని సందర్శించి మొక్కల పెరుగుదల, సంరక్షణ, నీటిపారుదల వంటి అంశాలపై సిబ్బందిని ప్రశ్నించారు. నర్సరీలో ఉన్న ప్రతి మొక్కను సమయానికి నీరు పోస్తూ, పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్తను తరచుగా తొలగించి పరిశుభ్ర వాతావరణం ఉంచాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో నర్సరీ కీలక పాత్ర పోషిస్తుందని, అందువల్ల మొక్కల పెంపకంలో ఏ ఒక్క నిర్లక్ష్యానికీ తావివ్వకూడదని సూచించారు.
తరువాత కంపోస్ట్ యార్డును పరిశీలించిన కమిషనర్ నర్సయ్య తడి చెత్తను సరిగా వేరు చేయడం, వాటి ద్వారా సేంద్రీయ ఎరువు(Organic Fertilizer) తయారీ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. పట్టణంలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను సమర్థవంతంగా వినియోగించాలి, దైనందినంగా చెత్తను శుభ్రపరిచి, కంపోస్టింగ్(composting) ప్రక్రియను వేగవంతం చేయాలి అని సూచించారు.
పర్యావరణానికి అనుకూలమైన స్వచ్ఛమైన పట్టణం నిర్మాణంలో కంపోస్టింగ్ కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ “పట్టణ అభివృద్ధి పచ్చదనంతో పాటు శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. నర్సరీ సంరక్షణ, నాణ్యమైన కంపోస్ట్ తయారీ ఇవే పర్యావరణ సమతౌల్యానికి పునాది” అని అన్నారు.
సిబ్బంది తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలని, పట్టణ ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంలో ఎవరు అలసట చూపకూడదని సూచించారు. పర్యటనలో మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
