పట్టు వస్త్రాలతో పొన్నం ప్రత్యేక పూజలు

రాష్ట్ర శ్రేయస్సుకు ప్రత్యేక ప్రార్థనలు
ప్రభుత్వం తరఫున ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
సమృద్ధిగా వర్షాలు, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఆషాఢ మాస బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ తమ తమ వృత్తుల్లో విజయాలు సాధించాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడించింది.

బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల భక్తుల రద్దీ పెరిగినా, అందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

బోనాలు కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకునే సాంస్కృతిక పండుగ అని ప్రభుత్వం పేర్కొంది. గతంలో విపత్కర పరిస్థితుల నుంచి తెలంగాణను అమ్మవారు కాపాడినట్లే, ప్రకృతి వైపరీత్యాల ముప్పు లేకుండా సమృద్ధిగా వర్షాలు కురిపించి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసింది.