తల్లిపాలే శిశువుకు సంపూర్ణ పోషణ

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో అవగాహన ర్యాలీ

గోవిందరావుపేట, ఆంధ్రప్రభ: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం పస్రా–4, వడ్డెరిగూడెం అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎన్‌ఎం సంపూర్ణ, అంగన్‌వాడీ టీచర్లు పద్మారాణి, భాగ్యమ్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం ద్వారా తల్లుల్లో అవగాహన పెంపొందించడం జరుగుతుందని తెలిపారు.

పుట్టిన ప్రతి శిశువుకు ఒక గంటలోపే తల్లిపాలు పట్టించడం ఎంతో అవసరమని చెప్పారు. మొదట వచ్చే ముర్రుపాలు పసుపు రంగులో చిక్కగా ఉండి శిశువుకు వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయని వివరించారు.

తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు తల్లి–బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని తెలిపారు. అలాగే తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గడంతో పాటు గర్భాశయం త్వరగా యథాస్థితికి చేరుతుందని, తదుపరి గర్భధారణకు సహజంగా విరామం లభిస్తుందని పేర్కొన్నారు.

శిశువుకు మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పస్రా–4 అంగన్‌వాడీ కేంద్రం ఆయా రాజ్యం, వడ్డెరిగూడెం అంగన్‌వాడీ కేంద్రం ఆయా కల్పన, ఆశా కార్యకర్త రమణమ్మ, తల్లులు, గ్రామస్తులు, చిన్నారులు పాల్గొన్నారు.