సరస్వతి అంత్య పుష్కరాల్లో ఆధ్యాత్మిక శోభ..

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు ఆధ్యాత్మిక వైభవం మరింత పెరిగింది. హంపికి చెందిన శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి మంగళవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉదయం సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ఆలయానికి చేరుకున్న మహాస్వామికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అడిషనల్ కమిషనర్ ఎం. కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో మహాస్వామిని ఆలయానికి ఆహ్వానించారు.

అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. తదుపరి మహా సరస్వతి అమ్మవారు, పార్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు.

పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో భక్తులకు ఆశీర్వచనం అందించిన మహాస్వామి, పుష్కరాల ఆధ్యాత్మిక మహిమను వివరించారు. ఆలయం తరఫున స్వామివారికి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మహేష్, ధర్మకర్తలు, ఆలయ అధికారులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply