పోస్టల్ శాఖలో హరి సర్వోత్తమాచారి సేవలు వెలకట్టలేనివి
36 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్‌గా 36 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన హరి సర్వోత్తమాచారికి పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం నిర్వహించారు.
శనివారం ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరి సర్వోత్తమాచారి దంపతులను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా పోస్టల్ ఐపీవో జుబేర్, ఊట్కూర్ పోస్టుమాస్టర్ బాలకృష్ణయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యప్రకాష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్ మాట్లాడుతూ హరి సర్వోత్తమాచారి తన ఉద్యోగ జీవితమంతా ప్రజలకు అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్టల్ సేవలను సమర్థవంతంగా అందించడంలో ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
పోస్టల్ శాఖ సేవలతో పాటు గ్రామంలో పురోహితునిగా అనేక కుటుంబాలకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తూ ప్రజల అభిమానం పొందారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన అనుభవంతో సమాజానికి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
హరి సర్వోత్తమాచారి తనకు సహకరించిన పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు, సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో ప్రజల ఆదరణే తనకు అతిపెద్ద గుర్తింపుగా భావిస్తున్నానని, భవిష్యత్తులోనూ సామాజిక, ఆధ్యాత్మిక సేవలను కొనసాగిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, పెద్దలు చందులాల్, అశోక్ రావు, గొల్ల నారాయణ, వసంత్, శంకర్ గౌడ్, శంకర్, రాఘవేంద్ర గౌడ్, రాములు, బీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
