మోయలేని భారం అవుతోంది..!
మోయలేని భారం అవుతోంది..!
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తల్లిదండ్రుల ఆవేదన
ఫీజుల భారం తగ్గించాలని ఏం.ఈ. ఓ కు వినతి పత్రం..
తరగతుల వారీగా ఫీజులను క్రమబద్ధీకరించాలని వేడుకోలు
నర్సంపేట, క్రైం, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలో గల ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు స్థానిక మండల విద్యా శాఖ అధికారి (ఎం.ఈ.ఓ) కొర్ర. సారయ్యకు వినతి పత్రం అందజేశారు. ఇందులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు ఏటేటా తరగతుల వారీగా ఫీజులను పెంచుతూ వెళ్తున్నట్లు ఆరోపించారు. బుక్స్, స్టేషనరీల రేట్లు సైతం చాలా ఎక్కువగా ఉంటున్నట్లు అందులో పేర్కొన్నారు. నర్సరీ పిల్లలకు రూ.30వేలు ట్యూషన్ ఫీజు మొదలు ప్రతీ ఏటా రూ.3-5 వేలు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. వీటికి బుక్స్ ఫీజు వేలల్లో ఉంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్. కే.జీ వాళ్లకు రూ.2-4 వేల వరకు బుక్స్ ఫీజు ఉంటడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు తమకు నచ్చిన బుక్ స్టాళ్లలో మాత్రమే కొనేలా ఒత్తిడి తెస్తున్నారని, బయట కొన్న విద్యార్థుల పట్ల వివక్ష చూపిస్తున్నట్లు తెలిపారు. బుక్స్, స్టేషనరీలను ఎక్కడైనా కొనుగోలు చేసేలా, ఫీజులను క్రమ పద్ధతిలో నియంత్రించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు.
