ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ బకాయిలు విడుదల.. !!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చిన హామీ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత 100 రోజుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రూ.6,000 కోట్ల బకాయిల చెల్లింపులను పూర్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా గురువారం మరో రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు విడతల్లో రూ.6,000 కోట్లు…
ప్రభుత్వం మూడు విడతల్లో ఒక్కోసారి రూ.2,000 కోట్ల చొప్పున మొత్తం రూ.6,000 కోట్లను విడుదల చేసింది. దీంతో విశ్రాంత ఉద్యోగుల కమ్యూటేషన్ బకాయిల చెల్లింపులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇతర బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
