గన్నవరం అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు: యార్లగడ్డ

  • 50 ఏళ్ల తర్వాత కట్ల ప్రాంతానికి సీసీ రోడ్డు..
  • గన్నవరం, రామవరప్పాడులో త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభం
  • విజయవాడ రూరల్ 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయాలి

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం రూ.31 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1976 నుంచి కట్ల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు దాదాపు 50 ఏళ్ల తర్వాత సీసీ రోడ్డు సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. కట్ల ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, పటేల్‌నగర్‌లో రూ.2.50 కోట్లతో పాటు పలు అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చామని తెలిపారు.

ప్రసాదంపాడులో ఇప్పటివరకు రూ.3.73 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించగా, ప్రసాదంపాడు–కానూరు కనెక్టింగ్ రోడ్డును రూ.2.52 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. గతంలో రైల్వే శాఖ అనుమతులు రాక కొన్ని రోడ్డు పనులు నిలిచిపోయినా, వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.

విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలు దశాబ్దాలుగా తాగునీరు, పారిశుధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో టీడీఎస్ స్థాయిలు అధికంగా ఉండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం విజయవాడ రూరల్ పరిధిలోని తొమ్మిది గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడమేనని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని, జనాభా లెక్కల ప్రక్రియ అనంతరం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలవరం కుడి కాలువ–ఏలూరు కాలువ అనుసంధానం, ఎనికేపాడు అండర్‌టన్నెల్ విస్తరణ వంటి పనులకు నిధులు సాధించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎనికేపాడు అండర్‌టన్నెల్ విస్తరణకు రూ.35 కోట్లు, ఏలూరు కాలువ రెగ్యులేటర్ అభివృద్ధికి రూ.36 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అలాగే ఆత్కూరు హై లెవెల్ బ్రిడ్జి, భూసేకరణకు కూడా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ గత నెల రోజుల్లోనే గన్నవరం నియోజకవర్గంలో రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సాగునీటి అవసరాల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో పలు కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు.

గన్నవరం పట్టణంలో త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు, అలాగే రామవరప్పాడులో మరో అన్న క్యాంటీన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

కట్ల ప్రాంత ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాబోయే మూడేళ్లలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

అదేవిధంగా గన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.5 కోట్లు కేటాయించామని, ట్రామా సెంటర్, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పనిచేస్తోందని, ప్రజల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం మరింత బలంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.