చీమలపాడు–వెంకట తండా రోడ్డుకు నిధులు ఇవ్వాలి
- గుంతలతో అస్తవ్యస్తంగా మారిన రహదారి
- కిందకు జారిన విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉందన్న గ్రామస్తులు
- కొత్త రోడ్డు నిర్మాణానికి వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
- 30 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని చీమలపాడు–వెంకట తండా రహదారి
- నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ: ఎ.కొండూరు మండలం చీమలపాడు అంకమ్మతల్లి ఆలయం నుంచి వెంకట తండాకు వెళ్లే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చీమలపాడు–వెంకట తండా రహదారి గుంతలతో పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంభాలకు సంబంధించిన తీగలు కిందకు జారిపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లే వ్యాన్లకు విద్యుత్ తీగలు తగులుతున్నాయని, దీంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సుమారు 30 ఏళ్ల క్రితం జడ్పీ నిధులతో నిర్మించిన ఈ రహదారికి అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టకపోవడంతో పూర్తిగా గుంతలమయంగా మారిందని తెలిపారు. దీంతో వాహనదారులు, తండా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
రహదారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే నిధులు మంజూరు చేసి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని వెంకట తండా గ్రామస్థులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేను కోరారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, వెంకట తండా టీడీపీ నాయకులు కృష్ణ, భూక్యా బద్దు, బాబురావు, తండా వాసులు కోటి, నాగబాబు, ఎస్సీ సెల్ టీడీపీ నాయకుడు మేకల రామారావు (జాన్) తదితరులు పాల్గొన్నారు.
