రేషన్ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి
కుటుంబ సభ్యులందరూ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాల్సిందే
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ: రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెంచడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం రేషన్ కార్డులకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరి చేసింది. మండలంలో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, గడువులోగా పూర్తి చేసేందుకు రేషన్ డీలర్లు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటి వరకు రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు వేలిముద్ర వేస్తే సరుకులు అందుకునే అవకాశం ఉండేది. దీంతో కొన్నిచోట్ల మరణించిన వారి పేర్లపై కూడా సరుకులు తీసుకోవడం, అర్హత లేని వారు కార్డులు వినియోగించడం వంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబ సభ్యుడి వివరాలను బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించేలా ఈ-కేవైసీ ప్రక్రియను అమలు చేస్తున్నారు.
రేషన్ దుకాణాల్లోనే ఈ-కేవైసీ నిర్వహిస్తున్నారు. ఈ-పాస్ (e-POS) యంత్రాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి కుటుంబ సభ్యుడు రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్ర లేదా అవసరమైతే ఐరిస్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికి మినహాయింపు ఉంటుంది.
వేలిముద్రలు నమోదు కాకపోతే ఐరిస్ ద్వారా గుర్తింపు నమోదు చేసే అవకాశం కూడా కల్పించారు. నిర్దేశిత గడువులోగా కుటుంబ సభ్యులు బయోమెట్రిక్ నమోదు చేయించుకోకపోతే వారి వివరాలపై అధికారులు పరిశీలన చేపడతారని తెలిపారు.
ఈ-కేవైసీ ప్రక్రియ ఇలా…
రేషన్ కార్డులో పేరు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాలి. వేలిముద్ర నమోదు చేసిన వెంటనే రేషన్ కార్డు, ఆధార్ వివరాలు తెరపై కనిపిస్తాయి.
వివరాలు సరిపోతే ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది. వివరాలు సరిపోకపోతే తిరస్కరణ సందేశం వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఆధార్, రేషన్ కార్డు వివరాలను సరిచేసుకుని మళ్లీ నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లుగా ఎరుపు రంగు సందేశం వచ్చిన వెంటనే పేరు తొలగిస్తారనే ప్రచారాన్ని అధికారులు ధృవీకరించలేదు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గైర్హాజరైతే, వారి బయోమెట్రిక్ నమోదు అనంతరం మాత్రమే వారి ఈ-కేవైసీ పూర్తవుతుందని తెలిపారు.
