లంక భూములకు రక్షణ కల్పించి న్యాయం చేయాలి
- ఫెర్రీ మహిళా సంఘాల సొసైటీ సభ్యుల డిమాండ్
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: స్థానిక ఫెర్రీలో లంక భూములకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ మహిళా సంఘాల సొసైటీ సభ్యులు గురువారం బైఠాయించి ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ, వైసీపీ నాయకుడు లంకే అంకమోహన రావు మాట్లాడుతూ పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో 30 నుంచి 40 అడుగుల లోతులో డ్రెడ్జింగ్ చేసి ఇసుక తవ్వడం వల్ల గుంతలు ఏర్పడి ఫెర్రీ మహిళా సంఘాల సొసైటీ లంక భూముల గట్లు విరిగి తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు.
లంక భూముల గట్లు బలహీనం వల్ల వరదల్లో ఎంతైనా కొట్టుకుపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక డ్రెడ్జింగ్ ను నిలిపివేసి సొసైటీ లంక భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. డ్రెడ్జింగ్ వల్ల చేపలు, రొయ్యలు చనిపోయి మత్స్యకారులు, అగ్నికుల క్షత్రియుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య తీవ్రతను అధికారులు గమనించి మహిళా సంఘాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.
