టీడీపీ కోసం పునరంకితం అవుదాం

టీడీపీ కోసం పునరంకితం అవుదాం

  • మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్
  • ఇబ్రహీంపట్నంలో ఘనంగా పసుపు పండుగ.

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ కన్వెన్షన్ లో క్లస్టర్ 9 పరిధిలో వర్చువల్ మహానాడును బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ హాజరయ్యారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు నేతలిద్దరూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు ప్రధాన వేదిక కార్యక్రమాన్ని ఇక్కడ భారీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. క్లస్టర్ 9 పరిధిలోని ఇబ్రహీంపట్నం మండల పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ సందేశాన్ని కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పసుపు జెండా గౌరవాన్ని కాపాడేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దామని, విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతు, పేద, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. మహానాడు తీర్మానాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని నాయకులకు సూచించారు. ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పసుపు జెండాలు, బ్యానర్లతో కన్వెన్షన్ ఆవరణ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల నాయకులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply