తాగునీటి కోసం మహిళల రాస్తారోకో
పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతు చేయాలని డిమాండ్..
ఖాళీ బిందెలతో నిరసన
మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు గురువారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోత్కూర్–తిరుమలగిరి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక డా. బంగ్లా ప్రాంతంలో నెల రోజులుగా త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నిత్యం కూలీ, వ్యవసాయ పనులకు వెళ్లే తమకు నీటి సమస్యతో ఉపాధికీ ఆటంకం కలుగుతోందని మహిళలు వాపోయారు. మహిళలు బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించడంతో కొంతసేపు వాహనాలు, బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదని తెలిపారు. ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టివేస్తూ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే పగిలిన పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి క్రమబద్ధంగా త్రాగునీరు అందించాలని మహిళలు డిమాండ్ చేశారు.
మరోవైపు మున్సిపల్ పరిధిలోని జామచెట్ల బావి ప్రాంతంలో కూడా గత నాలుగు, ఐదు రోజులుగా త్రాగునీటి కొరత తీవ్రంగా ఉందని స్థానికులు తెలిపారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్ల ద్వారా నీరు అందడం లేదని పేర్కొన్నారు. రామారం నుంచి వచ్చే మిషన్ భగీరథ పైప్‌లైన్ ఓ వ్యవసాయ పొలంలో పగిలిపోవడంతో మరమ్మతులు ఆలస్యమవుతున్నాయని, దీంతో ట్యాంక్ ద్వారా గానీ, మిషన్ భగీరథ ద్వారా గానీ నీటి సరఫరా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు అవసరాలకు సరిపోవడం లేదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి చేసి త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
