పినరయి విజయన్‌పై ఈడీ దాడులకు సీపీఎం నిరసన

పినరయి విజయన్‌పై ఈడీ దాడులకు సీపీఎం నిరసన

వలిగొండ, ఆంధ్రప్రభ: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఈడీ దాడులను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మద్దెల రాజయ్య, సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ, పినరయి విజయన్‌ను రాజకీయంగా, సైద్ధాంతికంగా ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ, కేరళలోని కాంగ్రెస్ కుమ్మక్కై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.

కేరళలో పది సంవత్సరాలు ప్రజానుకూల కార్యక్రమాలు అమలు చేసి, అవినీతిరహిత పాలన అందించిన పినరయి విజయన్‌పై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. దేశంలో అవినీతిపరులను తమ పార్టీల్లో చేర్చుకుంటున్న బీజేపీ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుని దాడులు చేయించడం సరికాదన్నారు.

ఇలాంటి చర్యల వల్ల దేశంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం తగ్గే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కేరళలో సీపీఎంను బలహీనపరచేందుకు బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కేరళ ఎన్నికల సమయంలో పినరయి విజయన్‌ను అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కూడా సీపీఎంను రాజకీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగమని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలను కేరళ సీపీఎం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కందడి సత్తిరెడ్డి, మండల కమిటీ సభ్యులు కల్కూరి రామచంద్రర్, దుబ్బ లింగం, భీమనబోయిన జంగయ్య, బూడిద మనమ్మ, వేముల నాగరాజు, శీలం ఇందిర, నాయకులు మద్దెల మారయ్య, కొమ్ము స్వామి, ధ్యానబోయిన యాదగిరి, కొండూరు సత్తయ్య, గంగాపురం వెంకటేశం, పాలోజు శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply